YSRCP MP MVV Fire on RRR: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీలందరూ ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ పార్లమెంటులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఏపీలో అధికార పార్టీకి చెందిన విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం సీన్ కనిపించింది. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఈ ఇద్దరు ఎంపీలు ఎదురెదురుగా కనపడగానే ఎంపీ రఘురామపై ఎంవీవీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (YSRCP MP MVV Fire on RRR)
చాలా కాలంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీలో తాను గెలవడానికి కారణమైన వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ, సీఎం జగన్‌ను, పార్టీ నేతలను దూషిస్తూ, తూలనాడుతూ వస్తున్నారు. చంద్రబాబును పొగుడుతూ సీఎం జగన్‌కు నమ్మకద్రోహం చేస్తున్నారు ఎంపీ రఘురామ. ఇటీవల వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎంపీ రఘురామ కలగజేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎంపీ రఘురామ.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకుల కిడ్నాప్‌పై కూడా భిన్నంగా స్పందించారు.
అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యులకే రాష్ట్రంలో దిక్కులేదంటూ అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ. ఈ నేపథ్యంలో అప్పుడే ఎంవీవీ సత్యనారాయణ వివరణ ఇచ్చుకున్నారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌కు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగతమని ఆయన చెప్పారు. సీఎం జగన్ పాలన గురించి గానీ, పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా గానీ పరిస్థితులు లేవని, ప్రతిపక్ష పార్టీ, ఓ వర్గం మీడియా వల్ల మాత్రమే తాను తన బిజినెస్‌లను తెలంగాణకు మార్చాలని అనుకుంటున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.
లేఖ రాయడానికి నువ్వెవరు?
అయితే, ఎంపీ రఘురామ ఆ సందర్భంగా ఎంవీవీ కుటుంబ సభ్యుల ఉదంతంపై కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన ఎంవీవీ.. పార్లమెంటు సాక్షిగా రఘురామ తీరుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రఘురామపై విరుచుకుపడ్డారు ఎంవీవీ. ఎంపీ రఘురామను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తన కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోంశాఖకు లేఖ రాయడం ఏంటని రఘురామపై ఎంపీ ఎంవీవీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోక్యం చేసుకొని శాంతింపజేసిన ఎంపీ మిధున్‌రెడ్డి
తోటి ఎంపీలు చూస్తుండగానే ఇదంతా జరగడంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. నువ్వెవడివి నా కుటుంబం గురించి లేఖ రాయడానికి అంటూ ఎంవీవీ మండిపడ్డారు. రఘురామను పార్లమెంట్ ఆవరణలోనే కడిగేశారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. పరిస్థితి సద్దుమణిగేలా చేసేందుకు అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎంవీవీని అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి. ఊహించని ఈ పరిణామంతో ఎంపీ రఘురామ ఖంగుతిన్నారు. ఎంవీవీ తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానంటూ వాపోయారు ఎంపీ రఘురామ.
లేపేస్తా .. లేపించేస్తా అని అసభ్యంగా మాట్లాడారు..
ఘటన తర్వాత తీవ్రంగా అవమానం పాలయ్యానని అనుకున్నారో ఏమో.. ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ఎంవీవీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. లేపేస్తా .. లేపించేస్తా అని ఎంపీ ఎంవీవీ అసభ్యంగా మాట్లాడారని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు దిగారని, ఇప్పుడు కూడా తన వంతుగా కంప్లయింట్ ఇచ్చానన్నారు. పక్కనున్న సాక్షుల పేర్ల తో సహా ఫిర్యాదు చేశాంటూ రఘురామ చెప్పుకొచ్చారు. ఎంపీ రఘురామ చాలా కాలంగా ఢిల్లీలోనే తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఏపీకి వస్తే తక్షణమే సీఐడీ విచారణ పేరిట అరెస్టు చేసి తమదైన శైలిలో పోలీసులు స్పందిస్తారనే భయంతో ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు.