Heavy Rains: దేశ వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో జోరుగా వానలు కొనసాగుతున్నాయి. రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ విభాగం. వచ్చేనాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. నేడు, రేపు తెలంగాణలో (Telangana Rains) అతిభారీ వర్షాలకు ఆస్కారం ఉందని ప్రకటించారు. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. (Heavy Rains)
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh Rains) చాలా జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ (Dhavaleswaram Barrage) వద్ద నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 10.2 అడుగులుగా నమోదైంది. లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పాత బస్టాండ్ దగ్గర విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
నేడు (18-07-23) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఉత్తరాదిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజా జీవనం స్తంభించేలా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కనీ వినీ ఎరుగని రీతిలో వానలు పడుతున్నాయి. ఉత్తరాదిలో 8 రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, గోవా , ఒడిశా, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాన్‌హోల్స్, మురికి కాలువలు, డ్రెయిన్ల వద్దకు వెళ్లొద్దని సూచించింది. వర్షా కాలం కరెంటు స్తంభాలవైపు వెళ్లవద్దని, వాటిని ముట్టుకోరాదని తెలిపింది.