Nizamabad: సాధారణంగా ఆలయాల్లోని కోనేరుల్లో దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుంటారు. ప్రఖ్యాతి గాంచిన అన్ని ఆలయాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. కోనేరులో అభిషేక సమయాన అందరూ భక్తి శ్రద్ధలతో పూజించి స్వామి వారిని తనివితీరా చూస్తూ భక్తి పారవశ్యం పొందుతుంటారు. ఇలాంటి సమయాల్లో అపచారం జరిగితే.. శివ శివా.. అని లెంపలేసుకుంటాం. తెలంగాణలోని నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన నీలకంఠేశ్వరుడి ఆలయం ఉంది. అక్కడ తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.
నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయ ఈవో వేణు కోనేరులో ఈత కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అక్కడ అందరూ భక్తిభావంతో భగవంతుడి అభిషేకాన్ని చూసి తరిస్తుండగా ఈవో చేష్టలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పుష్కరిణిలో జలకాలాటలు ఆడిన ఈవోపై అక్కడే ఉన్న అర్చకులు వారించారు. ఈత కొట్టవద్దని సూచించారు. భగవంతుని సన్నిధిలో ఇలా చేయడం భావ్యం కాదని నచ్చజెప్పే ప్రయత్నంచేశారు అర్చకులు. అయితే, పండితుల మాటలు ఈవో వేణు చెవికెక్కలేదు.
అర్చకుల మాటలు వినిపించుకోని ఈవో వేణు.. యథాలాపంగా ఈత కొట్టడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిషేకం జరుగుతున్నా పట్టించుకోకుండా దర్జాగా ఈత కొట్టడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవో చర్య విమర్శలకు కారణం అవుతోంది. అక్కడే ఉన్న భక్తులు కొందరు అభిషేక దృశ్యాన్ని మొబైల్ లో వీడియో తీశారు. ఈ క్రమంలో ఆ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈవో వేణుపై నెటిజన్లు, భక్తజనం తీవ్రంగా మండిపడుతున్నారు.
భగవంతుడంటే భయం, భక్తి లేవా?
ఈవో వేణు జిల్లాలోని నాలుగు ప్రధాన ఆలయాలకు ఇన్‌చార్జ్ ఈవోగా కూడా ఉన్నారు. వేణు తీరుపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాశీగా నీలకంఠేశ్వరుడి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. అలాంటి పుష్కరణిలో, అది కూడా దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తున్న సమయాన ఇలా ఏమాత్రం భయం, భక్తి లేకుండా ప్రవర్తించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారిని శిక్షించాల్సిన స్థానంలో ఉన్న ఈవో.. దిగజారిపోయి భక్తి భావం లేకుండా దేవుళ్లనే అపహాస్యం చేసేలా ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు.
ఆలయ ఈఓగా ఉన్న వేణు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి చర్యలు పునరావృతం కావంటున్నారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
నిజామాబాద్: నీలకంఠేశ్వరుని సన్నిధిలో అపచారం.. అభిషేక సమయాన కోనేరులో ఈవో జలకాలాట!#Nizamabad #Telangana #Hyderabad #Telugunews pic.twitter.com/69rcyeNKvZ
— Keerthanaa News (@KeerthanaaNews) May 26, 2023
Read Also : Congress: విపక్షాల ఐక్యతారాగం.. బీఆర్ఎస్ దూరం.. ఏమిటీ కేసీఆర్ ఆంతర్యం!