Throat Pain: చలికాలంలో చాలామందికి గొంతు నొప్పి వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారకమైన సూక్ష్మక్రీములు చేరడం ఇందుకు కారణం. చల్లని పానీయాలు తాగడం, సరిపడా తేమ గాలి లేని ప్రాంతాల్లో నివసించడం, జలుబు, ఫ్లూ గొంతు నొప్పికి దారి తీస్తాయి. గొంతులో అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ చుట్టూ వాపు లక్షణాలు కూడా కన్పిస్తాయి. (Throat Pain)
వాతావరణం మారినప్పుడు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల జలుబు, దగ్గు వస్తుంటాయి. ఒక్కోసారి గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. కానీ… వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా కూడా ఒక్కోసారి గొంతు నొప్పి వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను పరిష్కరించుకోవచ్చు.
గొంతు నొప్పికి కారణాలేంటి?
సాధారణంగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు వాతావరణం మార్పులు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల గొంతు నొప్పి వస్తుంటుంది. స్టెప్టోకోకల్ బ్యాక్టీరియా కూడా నొప్పికి కారణం అవుతుంది. ట్యాన్సిల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ సమస్య తలెత్తుతుంది. పొగ తాగడం, కాలుష్య వాతావరణం, కడుపులో గ్యాస్‌లు రివర్స్ కావడం వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కడుపులోని యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల అక్కడి కణాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నొప్పి కలుగుతుంది.
ఇన్‌ఫెక్షన్‌తో కూడిన గొంతు నొప్పి వచ్చినప్పుడు ఏదైనా మింగడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి గొంతు నొప్పి వారం పాటు తగ్గకపోవచ్చు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందిగా ఉండొచ్చు. కళ్లు ఎర్రబడటం, ముక్కు కారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. తలనొప్పి, ముక్కు దిబ్బడ, కడుపులో నొప్పి, వాంతులు కూడా తోడయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వృద్ధులు, పొగతాగే వారిలో గొంతు నొప్పిని తీవ్రంగా పరిగణించాలి. ఒక్కోసారి క్యాన్సర్ లక్షణంగా కూడా గొంతు నొప్పి రావొచ్చు.
గొంతు నొప్పి ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. నొప్పికి కారణం వైరసా, బ్యాక్టీరియానా పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. అందుకు అనుగుణంగా మందులు రాస్తారు. జలుబు, వైరస్ వల్ల వచ్చే గొంతు నొప్పికి చికిత్స లేదు. వైరస్ కారణంగా ట్యాన్సిలేటిస్ వచ్చినట్టయితే మామూలు మందులతో వ్యాధి నయం కాదు. ఇలాంటి సమయంలో వెచ్చని ద్రవాలు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. మసాలా ఆహారాలు, గట్టిగా ఉండే ఆహారాలు తినకూడదు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, ద్రవాలు ఎక్కువగా తాగాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గొంతు నొప్పికి దారి తీసే కారణాల్ని గుర్తించాలి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్లు గ్యాస్‌ను కంట్రోల్ చేసుకోవాలి. వీలయినంత వరకు కాలుష్యానికి, దుర్గంధం వచ్చే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండకూడదు. అక్కడ ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు కారణం అవుతాయి. చలికాలంలో వ్యాయామాలు చేయాలి. ఉదయం, సాయంత్రం వేడి నీళ్లతో ఆవిరి పట్టుకోవాలి.
చలి గాలిలో ఎక్కువగా తిరగకూడదు. ఎక్కువ కారం, ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఏడాదికోసారి ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్, ఆస్తమా ఉన్న వాళ్లు, అవయవ మార్పిడి చేసుకున్న వాళ్లు ఫ్లూషాట్ వ్యాక్సిన్ తీసుకోవడం మరీ మంచిది. గొంతు ఇన్‌ఫెక్షన్ ఒక్కోసారి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే గొంతు ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు.
Read Also : Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్‌ను ముందే గుర్తించగలమా? నిర్ధారణ అయితే ఏం చేయాలి?