Tandoori Chicken: వేడి వేడిగా కాస్త చికెన్ (Tandoori Chicken) చేసుకొని తింటే ఫుల్ జోష్ వస్తుంది. మసాలా దట్టించి వేడి వేడిగా తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అయితే, చికెన్ తినడం వల్ల పోషకాలు చేకూరే మాట అటుంచితే.. ఇప్పుడు ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ప్రియుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా తందూరి చికెన్ తింటే తిప్పలు తప్పవని, ఆరోగ్యానికి హాని చేస్తుందని చెబుతున్నారు.
మాంసాహార ప్రియులు సాధారణంగా చికెన్‌ను బాగా ఇష్టపడుతుంటారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, తందూరి చికెన్, చికెన్ 65, చికెన్ బిర్యానీ.. ఇలా రకరకాలుగా తయారు చేసుకొని లాంగించేస్తుంటారు. మాంసకృత్తులు శరీరానికి చేకూరడం వల్ల బలంగా తయారవుతారని చెబుతారు. బొంగుల చికెన్ మొదలు శవర్మా వరకు చికెన్ వంటకాలు మార్కెట్లోకి వచ్చాయి. చికెన్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది చెబుతారు.
అయితే చికెన్‌లో భారీగా ప్రోటీన్లు ఉంటాయనేది శాస్త్రీయంగానూ రుజువైంది. కానీ చికెన్‌లో విచిత్రమైన వంటకాల పద్దతే ఇప్పుడు ఆరోగ్యానికి హాని కలిగించే అంశంగా తయారవుతోంది. చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా చికెన్ లేదా మటన్ తెచ్చుకొని తిని తీరాల్సిందే. ఇక నిప్పులపై కాల్చి తయారు చేసే చికెన్‌కు ఇప్పుడు గిరాకీ బాగా ఉంది. తందూరి చికెన్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు.
తందూరి చికెన్ (Tandoori Chicken) అనేది పెరుగు, సుగంధ ద్రవ్యాలలో మెరినేట్ చేయసిన చికెన్. దక్షిణాసియా వంటకం. ఒక స్థూపాకార మట్టి ఓవెన్‌లోని తాండూర్‌లో కాల్చుతారు. ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. 1940వ దశకం చివరిలో న్యూ ఢిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్ ద్వారా ఈ వంటకం ఆధునిక రూపం ప్రాచుర్యం పొందింది. భారత కాంస్య యుగంలో హరప్పా నాగరికత కాలంలో తందూరి చికెన్‌ను పోలి ఉండే వంటకాలు ఉండొచ్చని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ వసంత్ షిండే ప్రకారం, తందూరీ చికెన్‌ను పోలిన వంటకానికి సంబంధించిన తొలి సాక్ష్యం హరప్పా నాగరికతలో కనుక్కొన్నారు.
తందూరి చికెన్ ఖ్యాతి చికెన్ టిక్కా వంటి అనేక ఉత్పన్నాలకు దారితీసిందని చెబుతారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రెస్టారెంట్‌లలోని మెనుల్లో కనిపిస్తుంది. తందూరి చికెన్ యొక్క దాదాపు అన్ని ఉత్పన్నాలు పెరుగు మరియు సిట్రస్ ఆధారిత మెరినేడ్‌తో ప్రారంభమవుతాయి.
చికెన్‌ను నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ కారకాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్ యాసిడ్ అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే హెటెరో సైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వండే పద్ధతిని ఓ సారి గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిప్పుల మీద కాల్చి చేసే తందూరి చికెన్, లేదా ఇతర మాంసాలను తింటే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు.
Read Also : Relationship tips for Couple: ఈ 5 అలవాట్లతో మీ బంధాన్ని దెబ్బతీసుకొనే ప్రమాదం..!