Chandra Mohan: సినీ వినీలాకాశంలో మరో ధ్రువతార నేలకొరిగింది. చంద్రవదనడు, చంద్రమోహనుడు దివికేగాడు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. (Chandra Mohan)
హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉ.9.45 గంటలకు హృద్రోగంతో చంద్రమోహన్ చనిపోయారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు సంతానం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 సంవత్సరం మే 23న జన్మించిన చంద్రమోహన్.. రంగులరాట్నం (1966) సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న నటుడిగా చంద్రమోహన్ చరిత్రలో నిలిచిపోయారు.
మేడూరు, బాపట్లలో చంద్రమోహన్ విద్యాభ్యాసం సాగింది. చంద్రమోహన్ భార్య జలంధర్ రచయిత్రిగా పేరుగాంచారు. పదేహారేళ్ల వయసు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం అప్పట్లో రికార్డు సృష్టించింది. రంగులరాట్నం, పదేహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చంద్రమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో చంద్రమోహన్ చిత్ర పరిశ్రమలో ఫేమస్ అయ్యారు.
చంద్రమోహన్ తమిళంలోనూ చాలా సినిమాలు చేశారు. చంద్రమోహన్, సుధ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీలు అనేకం వచ్చాయి. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ వెలుగొందారు. ఆక్సిజన్ సినిమాలో చివరిసారిగా నటించిన చంద్రమోహన్.. నేడు మనమధ్య లేకుండా కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ఏపీ సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సినిమాల్లో చంద్రమోహన్ తనదైన ముద్ర వేసుకున్నారని సీఎం జగన్ కొనియాడారు. గొప్ప దర్శకులు, నిర్మాణ సంస్థల సినిమాల్లో నటించారని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవీ చదవండి: Actor Naresh: నా ఫస్ట్ కజిన్ జయసుధ.. ఏడేళ్ల వయసులో ఏం చేశానో తెలుసా?: నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు
Tollywood Dubbed Movies: టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన 5 డబ్బింగ్ మూవీస్ ఇవే!