Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీకి సంబంధించి రేట్లు పెంచుకొనేందుకు ఏపీలో బ్రేకులు పడ్డాయి. ఇటీవల చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఏపీ సర్కార్ తీరుపై మెగా అభిమానులు విమర్శల జోరు పెంచారు. అయితే, సామాజిక మాధ్యమాలు, మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిబంధనలను మరోసారి గుర్తు చేస్తోంది. (Bholaa Shankar)
ఏయే ప్రత్యేక సందర్భాల్లో టికెట్ల రేట్లు పెంచుకొనేందుకు వెసులుబాటు ఉంటుందో క్లారిటీ ఇస్తోంది. కథానాయకుడు, కథానాయిక, డైరెక్టర్ పారితోషికాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు అయిన ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి రూ.100 కోట్లు దాటితే సినిమా టికెట్ల ధరలు మొదటి పది రోజులు పెంచుకోవడానికి అనుమతి ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు గతంలోనే రేట్లను పెంచుకొనేందుకు అనుమతిస్తూ 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు భోళాశంకర్ మూవీకి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి టికెట్ల పెంపుదలపై చిత్ర యూనిట్ రిక్వెస్ట్ పెట్టింది. అయితే, సరైన పత్రాలు సమర్పించలేదంటూ రేట్లు పెంచుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. సరైన విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాణ సంస్థ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ గత నెల 30న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSFTVTDC)కి అర్జీ పెట్టుకుంది.
దాన్ని పరిశీలించిన అధికారులు.. జీవో నంబర్ 2 రూపంలో ప్రత్యేక టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధనలను అనుసరించాల్సిన పద్ధతిని, సబ్‌మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లను, జతచేస్తూ ఈలనె 2న లేఖ ద్వారా చిత్ర బృందానికి తెలియజేసింది. అయితే అందుకు అవసరమైన పత్రాలను, డాక్యుమెంట్లను వారు ప్రభుత్వానికి సమర్పించలేదు.
సినిమా 20 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకోవాలి. అయితే, విశాఖ పోర్టు సహా, అరుకు ప్రాంతాల్లో 25 రోజుల పాటు చిత్రీకరణ జరిపినట్లు భోళా శంకర్ మూవీ నిర్మాణ సంస్థ పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను జతచేయాలని అధికారులు కోరారు. అవికూడా వారు సమర్పించలేదు. సినిమా షూటింగ్ అయ్యాక విడుదలకు ముందే నిర్మాత లేదా నిర్మాణ సంస్థ సినిమా కోసం చేసిన ఖర్చుపై అఫిడవిట్ సమర్పించాలి. దీన్ని ఛార్జెట్ అక్కౌంట్ సర్టిఫై చేయాలి. సినిమా నిర్మాణానికి సంబంధించి చేసిన చెల్లింపుల జీఎస్టీ లేదా ట్యాక్స్ రిటర్న్స్, అడ్వాన్స్ చెల్లింపుల ఇన్‌వాయిస్‌లు, బ్యాంకు స్టేట్మెంట్లు సమర్పించాలి. అయితే, ఇవేవీ సబ్‌మిట్ చేయలేదు.
చిరంజీవి వ్యాఖ్యలతో ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్య నేతలంతా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొర్రీలు పెడుతున్నారంటూ మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.
“కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ…లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్.”
“సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?” అని ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి మాట్లాడారనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే చిరంజీవి ఏకంగా జగన్ ప్రభుత్వం లక్ష్యంగా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. అయితే, సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలను సహిస్తారా? అనేది గమనించుకోవాల్సిన అంశం.