Chandrababu Release: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి జైల్లో ఉన్న చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను నాలుగు వారాల పాటు మంజూరు చేసింది. (Chandrababu Release)
చంద్రబాబు రాజకీయ సభలు, ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియాతో మాట్లాడొద్దని పేర్కొంది. ఈ మేరకు సీఐడీ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసింది.
52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చారు. కుటుంబ సభ్యులు, నాయకులను ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును చూసేందుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు వచ్చారు. విడుదలైన అనంతరం చంద్రబాబు జైలు పరిసర ప్రాంతాల్లోనే మీడియాతో మాట్లాడారు.
“తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు. రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు. పూజలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ సంఘీభావం ప్రకటించారు. నేను చేపట్టిన విధివిధానాల వల్ల లబ్ధి పొందినవారంతా స్పందించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
నాకు అండగా నిలిచిన వివిధ పార్టీ నేతలకు ధన్యవాదాలు. సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు. సంఘీభావం తెలిపిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా మొన్న సంఘాభావం తెలిపారు. మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులుగా గుర్తు చేసుకున్నారు.” అని చంద్రబాబు మీడియాతో అన్నారు.
అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన అమరావతికి బయల్దేరారు. రేపు సాయంత్రం తిరుమలకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్ లో కంటికి చికిత్స తీసుకోనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జైలు నుంచి బయటకు రాగానే చంద్రబాబు కాళ్లకు బాలకృష్ణ నమస్కరించారు. చంద్రబాబు బాలకృష్ణ భుజం తట్టారు. మనవడితో ఆప్యాయంగా బాబు ముచ్చటించారు.
రాజమండ్రి నుంచి అమరావతి బయల్దేరిన చంద్రబాబు వెంట టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం పలికారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఘనస్వాగతం పలికారు. బాణసంచా కాల్చి టీడీపీ, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
53 రోజులపాటు ఎంతో వేదన చెందాను: భువనేశ్వరి
తన భర్త చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని భార్య భువనేశ్వరి తెలిపారు. తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట ఇచ్చిందన్నారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని తెలిపారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేననన్నారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలన్నారు.
ఏపీ హైకోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు
జైలు నుంచి బయటకు వస్తూనే చంద్రబాబు మీడియాతో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ర్యాలీలో పాల్గొనకూడదు .. మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు షరతులు విధించినప్పటికీ హైకోర్టు షరతులను చంద్రబాబు లెక్కచేయలేదు. మధ్యంతర బెయిల్ షరతుల ఉల్లంఘనపై హైకోర్టు దృష్టికి సీఐడీ న్యాయవాదులు తీసుకెళ్లనున్నారు.
చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు
సీఐడీ అధికారుల కాల్‌డేటా స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. పిటిషన్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు.
ఇదీ చదవండి: YSRCP Bus Yatra: సామాజిక ధర్మాన్ని పాటిస్తున్న సీఎం వైఎస్ జగన్: బస్సు యాత్రలో నేతలు