Brijesh Tribunal: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని, ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ నవంబర్ 22, 23 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. (Brijesh Tribunal)
* రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నది జలాల పంపకాలపై విచారణాంశాలను నోటిఫై చేసిన కేంద్రం.
* రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈనెల 6న నోటిఫికేషన్.
* విచారణకు సిద్ధమైన బ్రిజేష్ ట్రిబ్యునల్.
* నవంబర్ 15 లోపు నోటిఫికేషన్‌పై అభిప్రాయం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశం.
* ఇవాళ విచారణ ప్రారంభం. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం చేయాల్సి ఉందన్న ఏపీ ప్రభుత్వం.
* దానిపై పూర్తి అధ్యయనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.
* అదే సమయంలో త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం.
* ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన తెలంగాణ ప్రభుత్వం.
* నీటి పంపకాలను వెంటనే చేపట్టాలని వినతి.
* అయితే, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్. విచారణ వాయిదా.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాలు ఇవ్వడంపై ఇటీవల ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర నిర్ణయాలన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఏపీ నిర్ణయించింది. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని సీఎం జగన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది.
కృష్ణానదిలో మొత్తం 2,130 టీఎంసీల్లో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 పంపిణీ చేసింది. అయితే ఈ అవార్డు గడువు ముగియడంతో కృష్ణానది జలాలను పునఃపంపిణీ చేయాలని నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోరడంతో అంతర్‌రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 మేరకు 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేశారు.