Darsi Road Accident : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Darsi Road Accident) సంభవించింది. సాగర్ కెనాల్ లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, చిన్నారి, యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. కాకినాడలో రిసెప్షన్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. (Darsi Road Accident)
క్రేన్ సాయంతో బస్సును పోలీసులు, సిబ్బంది బయటకు తీశారు. ఆర్టీసీ బస్సును (RTC Bus) అద్దెకు తీసుకొని పెళ్లి బృందం ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీళ్లు లేకపోవడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. తొలుత ఆరు మృతదేహాలు వెలికితీశారు. ఓ చిన్నారి మృతదేహం బస్సు కింద చిక్కుకున్న ఉదంతం అక్కడున్న వారికి కలచివేసింది. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మృతులు అబ్దుల్ అజీస్ (65), అబ్దుల్ హాని (60), ముల్లా జానీ బేగం (65), ముల్లా నూర్జహాన్ (58), షేక్ రమీజ్ (48), షేక్ షాభినా (35), షేక్ హీనా(6)గా గుర్తించారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భాంతి
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులకు సూచించారు.
Read Also : NCRB: పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న వలంటీర్లు.. అమ్మాయిల మిస్సింగ్ కేసులపై వాస్తవాలివీ..